Guntur District: బాపట్లలో దళిత కుటుంబంపై 20 మంది యువకుల దాడి

Dalit Family attacked by 20 people in Bapatla
  • 11వ వార్డు దేవుడిమాన్యంలో ఘటన
  •  భానుప్రసాద్ అనే వ్యక్తిని అడ్డగించి దారిలో వాగ్వివాదం
  • ఇంటికొచ్చి భార్య, పిల్లలపై దాడి
గుంటూరు జిల్లా బాపట్లలో ఓ దళిత కుటుంబంపై 20 మంది యువకులు దాడికి దిగి వారిని గాయపరిచారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని 11వ వార్డు దేవుడిమాన్యానికి చెందిన భానుప్రసాద్ మార్చురీ బాక్సులు అద్దెక్కిస్తుంటాడు.

బుధవారం రాత్రి మార్చురీ బాక్సు తీసుకుని ఆటోలో ఇంటికి వెళుతుండగా కారుమూరి హనుమంతరావు కాలనీ వద్ద రోడ్డుపై మద్యం తాగుతున్న కొందరు యువకులు ఆటోను అడ్డగించారు. హనుమంతరావుతో అసభ్యంగా మాట్లాడుతూ వాగ్వివాదానికి దిగారు. గొడవ జరుగుతుండడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.

ఆ తర్వాత భానుప్రసాద్ ఇంటికెళ్లిపోగా, ఆ వెంటనే ఓ 20 మంది యువకులు గుంపుగా అతడి ఇంటికి వెళ్లి దాడిచేశారు. భానుప్రసాద్, అతడి భార్య రాహేలు, ఇద్దరు కుమారులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషించారు. వారి దాడిలో భానుప్రసాద్‌తోపాటు భార్య, పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Guntur District
Bapatla
Crime News
Police
Andhra Pradesh

More Telugu News