Narendra Modi: అందుకే మోదీని రెండోసారి అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించారు: పవన్ కల్యాణ్

Modi is a strongest leader says Pawan Kalyan
  • శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారు
  • ఆయన ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం
  • మోదీకి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వాలి
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ లేఖను ఆయన విడుదల చేశారు. మన దేశంలో ఎంతో మంది వ్యక్తులకు ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం లభిస్తుందని... కానీ, కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

దేశభక్తి, నిశ్చలత్వం, నిస్వార్థం, సేవాతత్పరత, నిబద్ధత, దృఢ సంకల్పం ఉన్నవారికి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. అలాంటి గొప్ప నాయకులలో మోదీ అగ్రస్థానంలో ఉంటారని కితాబిచ్చారు. బాల్యదశలోనే సామాజికసేవకు ఆకర్షితులైన మోదీ.. ఆ సేవను నిర్విరామంగా కొనసాగిస్తూ ఒక దృఢమైన నాయకుడిగా రూపుదిద్దుకున్నారని అన్నారు.

ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, ఆయన ప్రయాణించిన జీవితం అందరికీ ఆదర్శనీయమని పవన్ చెప్పారు. భారత్ శాంతికాముక దేశమే కాదని, శత్రువులు కన్నెత్తి చూడలేని శక్తిమంతమైన దేశం కూడా అని ప్రపంచానికి మోదీ చాటిచెప్పారని ప్రశంసించారు. అందుకే రెండోసారి కూడా ఆయనను దేశ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించి, ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి మీకు భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జనసైనికుల తరపున మీకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.
Narendra Modi
BJP
Pawan Kalyan
Janasena

More Telugu News