Vijayawada: మరోమారు వాయిదా పడ్డ బెజవాడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం!

Kanakadurga Flyover Opening postponed one more Time
  • తొలుత ప్రణబ్ ముఖర్జీ మృతితో వాయిదా
  • తాజాగా నితిన్ గడ్కరీకి కరోనా రావడంతో...
  • వాహన రాకపోకలకు రేపటి నుంచి అనుమతి
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా నల్గొండ, హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు త్వరగా నగరాన్ని దాటేందుకు ఉపకరిస్తుందన్న అంచనాతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోమారు వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెలారంభంలోనే ఈ వంతెన జాతికి అంకితం కావాల్సి వుండగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వాయిదా పడింది.

ఆపై రేపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా వంతెనను ప్రారంభింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, నితిన్ గడ్కరీకి కరోనా సోకి, ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిన నేపథ్యంలో, మరోమారు వంతెన ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

"గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది" అని నాని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Vijayawada
Kanakadurga Fly over
Nitin Gadkari
Kesineni Nani

More Telugu News