Donald Trump: గత ఎన్నికలతో పోలిస్తే.. ట్రంప్‌కు పెరుగుతున్న ఇండియన్ అమెరికన్ల మద్దతు!

Indian americans stand with joe biden in presidential polls
  • బైడెన్‌కు 66 శాతం, ట్రంప్‌కు 28 శాతం మంది భారతీయుల మద్దతు
  • ఎన్నికల సమయానికి  ఓటర్ల మూడ్ మారుతుందన్న సర్వే
  • డెమోక్రాట్లలో ఆందోళన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్ కు ఇండియన్ అమెరికన్లలో క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఎన్నికల సమయానికి ఓటర్ల మూడ్ మారుతుందని, 30 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలుస్తారని ఇండియాస్పొరా అండ్ ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) డేటా సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో 16 శాతం మంది భారతీయులు ట్రంప్‌కు మద్దతు ఇచ్చారని, ఈసారి 30 శాతం మంది ఇస్తే అది భారీ పెరుగుదలే అవుతుందని ఈ సర్వేకు నేతృత్వం వహించిన డాక్టర్ కార్తీక్ రామకృష్ణన్ పేర్కొన్నారు.

ఇక, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను అనూహ్యంగా ఉపాధ్యక్ష పదవి రేసులో దింపిన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు భారతీయ అమెరికన్ల మద్దతు పెరుగుతోందని సర్వేలో తేలింది. కమలా హారిస్‌ ఎంపిక ఆయనకు కలిసి వస్తుందని తెలిపింది. 66 శాతం మంది భారతీయులు బైడెన్‌కు జై కొట్టగా, ట్రంప్‌కు 28 శాతం మంది మద్దతు పలికారు. 6 శాతం మంది మాత్రం ట్రంపా, బైడెనా అనేది తేల్చుకోలేకపోతున్నట్టు చెప్పారు.

మరోవైపు, ప్రవాస భారతీయుల్ని ఆకట్టుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని ట్రంప్ వదులుకోవడం లేదని  కార్నెజీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్, దక్షిణాసియా ప్రోగ్రాం డైరెక్టర్‌ మిలాన్‌ వైష్ణవ్‌ అన్నారు. ఇక, 2012లో బరాక్ ఒబామాకు 84 శాతం మంది, 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు 77 మంది భారతీయులు ఓట్లు వేశారు. వారితో పోల్చి చూస్తే బైడెన్‌కు లభిస్తున్న మద్దతు తక్కువగా ఉండడంతో డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు.
Donald Trump
Joe biden
america
Presidential polls
american indians

More Telugu News