Suresh Raina: సురేశ్ రైనా బంధువుల హత్య అంతర్రాష్ట్ర ముఠా పనే... ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Punjab police busted Suresh Raina relatives murder case
  • గత నెలలో పంజాబ్ లో సంచలనం సృష్టించిన హత్యలు
  • రైనా మామ, బావమరిది మృతి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైనా అత్త, మరో ఇద్దరు
ఇటీవల పంజాబ్ లోని పఠాన్ కోట్ ప్రాంతంలో క్రికెటర్ సురేశ్ రైనా బంధువులపై దోపిడీ దొంగలు తీవ్రస్థాయిలో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇంటి యజమాని అశోక్ కుమార్, ఆయన కుమారుడు కౌశల్ కుమార్ మృతి చెందారు. ఆయన భార్య, మరో కుమారుడు, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో పంజాబ్ పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు.

పఠాన్ కోట్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో తిరుగాడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు. వారి నుంచి హత్యకు దాడి చేసిన కర్రలను, కొంత బంగారాన్ని, స్వల్ప మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరు అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యులని, పంజాబ్ లోనే కాకుండా ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ లోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని వివరించారు.

ఈ ఘటన ఎలా జరిగిందో డీజీపీ మీడియాకు వివరించారు. గత నెల 19న దొంగలు మూడు గ్రూపులుగా విడిపోయారని, అయితే రెండు ఇళ్లలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారని  తెలిపారు. అనంతరం, రైనా మామ అశోక్ కుమార్ నివాసంలోకి ఐదుగురు దొంగలు ప్రవేశించారని, నిద్రిస్తున్న ముగ్గురిపై కర్రలతో దాడి చేశారని, దోపిడీ పూర్తి చేసుకుని వెళ్లే క్రమంలో మరో ఇద్దరిపై దాడి చేసి పారిపోయారని వెల్లడించారు. ఈ దోపిడీ వెనుక పక్కా ప్లాన్ ఉందని డీజీపీ వివరించారు.
Suresh Raina
Relatives
Murder
Pathankot
Punjab
Police

More Telugu News