TikTok: ఒరాకిల్ ను ఎంచుకున్న టిక్ టాక్.. మైక్రోసాఫ్ట్ కు నిరాశ

Video sharing app Tik Tok declines Microsoft offer
  • అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలపై నిషేధం
  • టిక్ టాక్ కోసం బైట్ డ్యాన్స్ తో చర్చలు జరిపిన మైక్రోసాఫ్ట్
  • మైక్రోసాఫ్ట్ ను కాదని ఒరాకిల్ తో జట్టుకట్టిన టిక్ టాక్
టిక్ టాక్, వీ చాట్ వంటి చైనా యాప్ లు అమెరికా పౌరుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించడం తెలిసిందే. ఈ చైనా యాప్ లు అమెరికాలో తమ కార్యకలాపాలను ఇతర సంస్థలకు విక్రయిస్తే తప్ప ఈ నిషేధం నుంచి తప్పించుకోలేవు. ట్రంప్ ఇందుకోసం 45 రోజుల గడువు కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో లోతైన చర్చలు కూడా జరిపింది. అయితే మైక్రోసాఫ్ట్ ఆశలకు అడ్డుకట్ట వేస్తూ టిక్ టాక్ తన టెక్ భాగస్వామిగా ఒరాకిల్ ను ఎంచుకుంది. అమెరికాలో తన కార్యకలాపాల కోసం ఒరాకిల్ సంస్థతో జట్టు కట్టేందుకు మొగ్గు చూపింది. తద్వారా అమెరికాలో నిషేధం నుంచి తప్పించుకున్నట్టేనని చెప్పాలి. అయితే, టిక్ టాక్ లో ఒరాకిల్ మెజారిటీ వాటాలు తీసుకుంటుందా అన్నదానిపై స్పష్టత రాలేదు.

కాగా, తాజా పరిణామాలపై మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటన చేసింది. "అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ కు విక్రయించడంలేదని బైట్ డ్యాన్స్ మాకు తెలియజేసింది. జాతీయ భద్రత అంశాల దృష్ట్యా మా ప్రతిపాదన టిక్ టాక్ యూజర్లకు ఎంతో లాభించేదని గట్టిగా చెప్పగలం" అని పేర్కొంది. తాజా డీల్ పై స్పందించేందుకు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కానీ, ఒరాకిల్ కానీ ముందుకు రాలేదు.
TikTok
Microsoft
Oracle
USA
Donald Trump
China

More Telugu News