Corona Virus: టీకాపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తొలుత నేనే తీసుకుంటా: కేంద్రమంత్రి హర్షవర్ధన్

Front line workers will get vaccine first says Harsh Vardhan
  • వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోగా అందుబాటులోకి టీకా
  • ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు తొలి ప్రాధాన్యం
  • అత్యవసరమైన వారికి ఖర్చుతో సంబంధం లేకుండా ఇస్తాం
కరోనా మహమ్మారిని అదుపు చేసే టీకా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోపు అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. టీకా సామర్థ్యంపై ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు దానిని తొలుత తానే తీసుకుంటానని పేర్కొన్నారు.

ఆదివారం నిర్వహించిన ‘సండే సంవాద్’ అనే ఆన్‌లైన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ఇస్తామన్నారు. ఖర్చుతో సంబంధం లేకుండా అత్యవసరమైన వారికి అందిస్తామన్నారు. టీకాపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తాను వలంటీర్‌గా మారి తొలుత తీసుకుంటానని అన్నారు.

ప్రస్తుతం టీకా ధర, భద్రత, ఉత్పత్తి, ఈక్విటీ సహా పలు అంశాలపై చర్చిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రెమ్‌డెసివిర్ ఔషధ వినియోగం విషయంలో అక్రమాలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఔషధ నియంత్రణ మండలికి సూచించినట్టు మంత్రి తెలిపారు.
Corona Virus
Harshvardhan
covid vaccine

More Telugu News