MIM: స్వాతంత్ర్యం వచ్చాక భూములు పొగొట్టుకున్నవారిలో ముస్లింలే అధికంగా ఉన్నారు: అక్బరుద్దీన్ ఒవైసీ

MIM member Akbaruddin Owaisi says they welcomes new revenue act
  • తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సర్కారు
  • బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
  • సీఎంకు అభినందనలు తెలిపిన అక్బరుద్దీన్ 
  • కొత్త చట్టం మేలు చేస్తుందని భావిస్తున్నట్టు వెల్లడి
తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. మొన్ననే దీనికి సంబంధించిన బిల్లును సీఎం కేసీఆర్ చట్టసభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో తమ వైఖరి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు ఎంఐఎం పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా ఒవైసీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చాక అనేక మంది భూములు పోగొట్టుకున్నారని, భూములు కోల్పోయిన వారిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారని వెల్లడించారు. గతంలో భూములకు సంబంధించి ఎన్నో చట్టాలు వచ్చినా, భూ ఆక్రమణలకు మాత్రం అడ్డుకట్ట పడలేదని అన్నారు. పైగా ఆ చట్టాలు భూకబ్జాదారులకు అనుకూలంగానే ఉండేవని విమర్శించారు. పట్టాల ఎంట్రీలో అక్రమాలు జరిగాయని, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి రికార్డుల్లో తేడాలు వచ్చాయని వివరించారు.

తాజా రెవెన్యూ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను కాపాడాలని, వక్ఫ్ భూములు, దర్గాలు, ఆలయాలకు చెందిన భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయొద్దని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
MIM
Akbaruddin Owaisi
New Revenue Act
TRS
KCR
Telangana

More Telugu News