serum survey: ఐదు కోట్ల ఏపీ జనాభాలో కోటిమందికి కరోనా సోకి.. తగ్గిపోయింది: సీరో సర్వే

One crore people in Andhrapradesh Infected to corona
  • తొలి దశలో 4, రెండో దశలో 9 జిల్లాలలో సీరో సర్వే
  • 9 జిల్లాల నుంచి 45 వేల నమూనాలు సేకరణ
  • విజయనగరం జిల్లాలో అత్యధికంగా 30.6 శాతం మందిలో యాంటీబాడీలు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని దాదాపు 5 కోట్ల మంది జనాభాలో ఇప్పటికే కోటిమందికి అంటే మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి వారికి తెలియకుండానే కరోనా వైరస్ సోకి వెళ్లిపోయినట్టు తేలింది. వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది.

తొలి దశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సర్వే నిర్వహించింది. రక్తంలోని సీరంలో ఉన్న యాంటీబాడీల ఆధారంగా కరోనా సోకిందీ, లేనిదీ నిర్ధారించవచ్చు. ఈ సందర్భంగా ఈ నాలుగు జిల్లాలో నిర్వహించిన సర్వేలో 15.7 శాతం మందికి కరోనా సోకి వెళ్లిపోయినట్టు తేలింది. మిగిలిన తొమ్మిది జిల్లాలలో రెండో దశలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ నిన్న వెల్లడించారు.

రెండో దశ సర్వేలో భాగంగా ఒక్కో జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున 9 జిల్లాల నుంచి మొత్తం 45 వేల నమూనాలు సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి వారికి తెలియకుండానే వైరస్ సోకి వెళ్లిపోయినట్టు నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 30.6 శాతం మందిలో, కర్నూలు జిల్లాలో 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.5 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.

చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. అతి తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 12.3 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయి. తెలియకుండానే వైరస్ సోకిన వారిలో 19.5 శాతం మంది పురుషులు కాగా, 19.9 శాతం మంది మహిళలు ఉన్నారు.

వైరస్ వ్యాప్తి ఏయే జిల్లాల్లో ఎలా ఉందో తెలుసుకునేందుకే సర్వే నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు.
serum survey
Andhra Pradesh
Corona Virus
Vizianagaram
andtibodies

More Telugu News