Chandrababu: మొదట టీడీపీపై, ఆ తర్వాత ఎస్సీలపై దాడులు చేశారు... ఇప్పుడు ఏకంగా ఆలయాలపై పడ్డారు: చంద్రబాబు
- ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో వీడియో కాన్ఫరెన్స్
- వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్
- నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యలు
- గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని అరాచకాలు చేయలేదన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధ్వంసం, వినాశనం, దాడులు, దౌర్జన్యాలే వైసీపీ లక్ష్యాలని విమర్శించారు. ముందుగా టీడీపీ నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడులు చేశారని, అనంతరం బీసీలపైనా, ఎస్సీలపైనా దౌర్జన్యాలకు తెగబడ్డారని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఆలయాలపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు.
గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని అరాచకాలకు పాల్పడలేదని అన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. నియంతలంతా కాలగర్భంలో కలిసిపోయారని తెలిపారు. ఆఖరికి వరద బాధితుల పునరావాసంలోనూ రాజకీయాలు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మంత్రులను వరద బాధితులే నిలదీయడం వైసీపీ వైఫల్యాలకు పరాకాష్ఠ అని విమర్శించారు.