Devraj Reddy: నటి శ్రావణి ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు: దేవరాజు రెడ్డి

Devraj Reddy clarifies about tv actress Sravani suicide
  • మధురానగర్ లో బుల్లితెర నటి శ్రావణి బలవన్మరణం
  • కుటుంబ సభ్యులతో పాటు సాయి అనే వ్యక్తిపై దేవరాజు ఆరోపణలు
  • శ్రావణి తనను ఇష్టపడిందని వెల్లడి
  • అందుకే ఈ సమస్యలు వచ్చాయన్న దేవరాజు
హైదరాబాదులోని మధురానగర్ లో టీవీ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో తనకెలాంటి సంబంధం లేదని శ్రావణి స్నేహితుడు దేవరాజు రెడ్డి స్పష్టం చేశాడు. ఆమె ఆత్మహత్యకు తాను కారణం కాదని, ఆమె కుటుంబసభ్యులతో పాటు సాయి అనే వ్యక్తి ఈ ఆత్మహత్యకు కారకుడని ఆరోపించాడు. శ్రావణితో తనకు ఏడాది కిందటే పరిచయం అయిందని, కానీ సాయి అనే వ్యక్తితో ఆమెకు ఐదేళ్లుగా పరిచయం ఉందని దేవరాజు రెడ్డి వెల్లడించాడు.

రెండ్రోజుల కిందట తాను, శ్రావణి రెస్టారెంట్ కు వెళితే అక్కడికి సాయి వచ్చాడని, ఆమెపై చేయి చేసుకున్నాడని తెలిపాడు. ఈ మేరకు దేవరాజు రెడ్డి ఓ వీడియోలో వెల్లడించాడు. తనను తల్లిదండ్రులు దారుణంగా కొట్టారని, తమ్ముడు కూడా హింసించాడని, సాయి అనే వ్యక్తి రోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టాడని శ్రావణి తనతో చెప్పినట్టు దేవరాజు ఆ వీడియోలో పేర్కొన్నాడు. అందుకే వాళ్ల ముఖాలు మళ్లీ చూడదలచుకోలేదని, తన చావుకు కారణం సాయి అనే వ్యక్తి అని కూడా శ్రావణి తెలిపిందని దేవరాజు వివరించాడు. శ్రావణి తనను ఇష్టపడడం వల్లే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చాయని దేవరాజు వాపోయాడు.
Devraj Reddy
Sravani
Suicide
Tv Actress
Hyderabad

More Telugu News