: ఫిక్సింగ్ వ్యవహారంలో మరో మలుపు!
సంచలనం సృష్టించిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఉదంతంలో బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పాత్ర ఉందని తెలిసింది. నిన్న ముంబయిలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ చెప్పిన వివరాల మేరకు గురునాథ్ కూ క్రికెట్ కుంభకోణంలో భాగముందని పోలీసులు భావిస్తున్నారు. విందూ సింగ్ తాను తరచూ శ్రీనివాసన్ మేనల్లుడితో ఫోన్ లో మాట్లాడినట్టు విచారణలో వెల్లడించాడు. కాగా, గురునాథ్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. చెన్నై ఫ్రాంచైజీ శ్రీనివాసన్ కు చెందినదన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో గురునాథ్ ను ప్రశ్నించేందుకు ఢిల్లీ పోలీసులు సమాయత్తమవుతున్నారు.