Nara Lokesh: తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని స్వయంగా ఆయన సొంత మీడియా సాక్షే చెబుతోంది: నారా లోకేశ్

Nara Lokesh questions AP Government on free current
  • ఉచిత విద్యుత్-నగదు బదిలీపై లోకేశ్ వ్యాఖ్యలు
  • రైతులపై భారం మోపుతున్నారంటూ విమర్శలు
  • మీకు మనసెలా ఒప్పుతోంది జగన్ రెడ్డి అంటూ ట్వీట్
వైసీపీ ప్రభుత్వం సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తడిగుడ్డతో గొంతు కోయాలని చూస్తోందని, తండ్రి ఆశయాలకు కొడుకు తూట్లు పొడుస్తున్నాడని స్వయంగా ఆయన సొంత మీడియా సాక్షే చెబుతోందని ఆరోపించారు. అప్పట్లో కిరణ్ సర్కారు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడుతోందని, ఈ మీటర్లు రైతుల పాలిట యమపాశాలు కాబోతున్నాయని జగన్ మీడియా చక్కగా వివరించిందని తెలిపారు.

గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు నెలలు గడుస్తున్నా బ్యాంకులో జమకావడంలేదని, ఇప్పుడు ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ అమలు చేస్తే ఇదే రీతిలో సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడనుందని పేర్కొన్నారు. నగదు బదిలీ పేరుతో భారాన్ని రైతుపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. "దశల వారీగా సబ్సిడీ తగ్గించి పథకాన్ని నిర్వీర్యం చేస్తారని, మీటర్ల వలన రైతులకు జరిగే నష్టం గురించి అప్పట్లో మీరే చెప్పారు. ఇప్పుడు రైతులను మోసం చేస్తూ వారిని నట్టేట ముంచడానికి మీకు మనసెలా వచ్చింది జగన్ రెడ్డి" అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

Nara Lokesh
YSRCP
Jagan
Free Current
Farmers

More Telugu News