Pakistan Flag: ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరేశాడు... మూల్యం చెల్లించాడు!

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సామరస్యతకు భంగం కలిగించాడంటూ కేసు 
Madhya Pradesh man hurls Pakistan flag on his house

మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరేసి కలకలం సృష్టించాడు. షిప్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అతడి పేరు ఫారూఖ్ ఖాన్. అతడు తన నివాసంపై పాక్ జెండా ఎగురవేయడమే కాదు, దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. ఇది పోలీసుల వరకు వెళ్లడంతో వారు వెంటనే స్పందించి ఫారూఖ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

సామాజిక సామరస్యతకు భంగం కలిగిస్తున్నాడన్న ఆరోపణలపై అతడి మీద కేసు నమోదు చేశారు. అతడి నివాసం నుంచి పాక్ జెండాను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు కొద్దిమేర డ్రామా చోటుచేసుకుంది. ఈ జెండా ఎగురవేసిన విషయంలో రెవెన్యూ అధికారులు ఫారూఖ్ ఖాన్ ను ప్రశ్నించగా, మైనర్ అయిన తన కుమారుడు తెలియక ఎగరేశాడంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆ జెండాను తాను అప్పుడే తగులబెట్టానంటూ అధికారులతో నమ్మబలికాడు.

కానీ సోదాలు చేయగా, ఆ జెండా సాధారణ స్థితిలోనే లభ్యమైంది. దాంతో అతడిపైనా, అతడి కుటుంబంలోని మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫారూఖ్ ఖాన్ షిప్రా గ్రామంలో టైర్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు.

More Telugu News