Sonia Gandhi: దేశంలో నియంతృత్వం పెరిగిపోతోంది: సోనియా
- ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సోనియా
- దేశం దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటోందని ఆవేదన
- దేశాన్ని గాడి తప్పించే చర్యలు జరిగాయని వెల్లడి
దేశంలో నిరుపేదలకు వ్యతిరేకంగా విచ్ఛిన్నకర శక్తుల ప్రాబల్యం పెరిగిపోతోందని, జాతి విద్రోహశక్తులు విషం చిమ్ముతున్నాయని, హింసను ప్రజ్వలింప చేస్తున్నాయని కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోని 'లోక్ షాహీ' (ప్రజాస్వామ్యం)పై 'తానాషాహీ' (నియంతృత్వం) ప్రభావం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులు, జాతిపితలు ఈ 75 ఏళ్లలో దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతాయని ఎన్నడూ ఊహించి ఉండరని పేర్కొన్నారు.
దుష్ట ఆలోచనలే ఇప్పడు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ముప్పు ఎదుర్కొంటోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం అవుతున్నాయని తెలిపారు. గత కొంతకాలంగా దేశాన్ని గాడి తప్పించే చర్యలు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యం ముందు కొత్త సవాళ్లు నిలిచాయని సోనియా వ్యాఖ్యానించారు. దేశం ఇవాళ దిక్కుతోచని స్థితిలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చత్తీస్ గఢ్ లోని న్యూ రాయ్ పూర్ లో కొత్త అసెంబ్లీ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగానే సోనియా వ్యాఖ్యలు చేశారు.