సినీ పరిశ్రమలో నెపోటిజం.. బాలకృష్ణ, నాగార్జున, తారక్ లను ఉదహరిస్తూ ఖండించిన నాగబాబు!
- మా కుటుంబంలో అందరూ కష్టపడే పైకి వచ్చారు
- బాలయ్య, నాగ్, తారక్, మహేశ్ అందరూ సొంత టాలెంట్ తోనే ఎదిగారు
- నచ్చకపోతే ప్రేక్షకులు ఎవరినైనా తిరస్కరిస్తారు
ఎన్టీఆర్ కుమారుడు కాబట్టే బాలకృష్ణ స్టార్ అయ్యారని, నాగేశ్వరరావు కొడుకు కాబట్టే నాగార్జున అగ్ర నటుడు అయ్యారని చెప్పుకోవడం హాస్యాస్పదం అని నాగబాబు అన్నారు. వీరంతా తమ టాలెంట్ తోనే గొప్ప నటులయ్యారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడో తాను స్వయంగా చూశానని అన్నారు. 'అరవింద సమేత' షూటింగ్ లో 44 డిగ్రీల ఎండలో షర్ట్ లేకుండా తారక్ ఫైట్ చేయడాన్ని తాను కళ్లారా చూశానని చెప్పారు.
తొలి రోజుల్లో మహేశ్ బాబు లావుగా ఉండేవాడని... కానీ, సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజు రన్నింగ్ చేసేవాడని నాగబాబు తెలిపారు. అందరూ చూస్తుండగానే స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా మహేశ్ తయారైపోయాడని కితాబునిచ్చారు. కష్టపడని వారికి సినీ పరిశ్రమలో చోటు లేదని చెప్పారు. ఎంతటి స్టార్ కుమారుడినైనా... నచ్చకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తారని అన్నారు.