Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసాలు జరిగే ఛాన్స్: ట్రంప్

 Trump alleges ballot rigging
  • ప్ర‌త్య‌ర్థులు రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశాలు 
  • దేశ ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు కరోనా సాకు
  • మెయిల్ బ్యాలెట్ విధానం సరికాదు
  • గెలవాలంటే ప్రస్తుతం ప్రత్యర్థులకు రిగ్గింగ్ ఒక్క‌టే మార్గం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దాదాపు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో  రిప‌బ్లిక‌న్, డెమోక్రటిక్ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఉత్తర క‌రోలినాలో జ‌రిగిన రిపబ్లికన్ పార్టీ స‌మావేశంలో అమెరికా  అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ... అధ్యక్ష ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులు రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

దేశ ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు కరోనా విజృంభణను కార‌ణంగా చూపెడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలు కుయుక్తులు పన్నే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. మెయిల్ బ్యాలెట్ విధానం సరికాదని, మోసాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయని అన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ఎన్నిక‌ల్లో గెలుపొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.

వారు అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే ప్రస్తుతం రిగ్గింగ్ ఒక్క‌టే వారికి మార్గంగా కనపడుతోందని ట్రంప్ తెలిపారు. అయినప్పటికీ, వచ్చే ఎన్నిక‌ల్లో తాము విజ‌యం సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గ‌త ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా నిలిచిన హిల్ల‌రీ క్లింటన్‌ అనుచరులు కూడా రిగ్గింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆయన ఆరోపణలు గుప్పించారు.
Donald Trump
USA
elections

More Telugu News