Corona Virus: ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా విదేశాల నుంచి రావచ్చు: కేంద్రం!
- కరోనా కారణంగా నిలిచిన విమాన సేవలు
- ట్రావెల్ గైడ్ లైన్స్ ను సవరించిన కేంద్రం
- 13 దేశాలవారు ఆంక్షలు లేకుండా రావచ్చని వెల్లడి
కరోనా కారణంగా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ నిలిచిపోగా, ఇప్పుడిప్పుడే ఒక్కో సర్వీసు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలను మరింతగా సడలిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇండియాతో 'ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్'నుఏర్పాటు చేసుకున్న దేశాల నుంచి ఎవరైనా రావాలనుకుంటే, వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, ట్రావెల్ గైడ్ లైన్స్ ను సవరించింది.
పలు దేశాల మధ్య, వాణిజ్యపరమైన విమాన సంబంధాలు, ప్రయాణికుల రాకపోకల నిమిత్తం అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు పలు దేశాల మధ్య 'ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్స్' ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇండియాకు ప్రస్తుతం యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాలతో ఇదే తరహా ఒప్పందాలు ఉన్నాయి. మరో 13 దేశాలతో ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, ఈ దేశాల నుంచి వచ్చేవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోనక్కర్లేదని పౌర విమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పురి అన్నారు.
కాగా, ఇప్పటివరకూ విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు వందే భారత్ మిషన్ లో భాగంగా విమానాలు నడుపుతుండగా, వాటిని ఎక్కాలనుకునేవారు ముందుగానే సంబంధిత దేశాల భారత కార్యాలయాల్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇకపై ఆ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మార్చి 23 నుంచి రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.