Pawan Kalyan: 'చిరంజీవి మావాడు' అని చెప్పుకునేలా తనను తాను మలుచుకున్నారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes his brother Chiranjeevi on his birthday
  • నేడు చిరంజీవి బర్త్ డే
  • శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు పవన్ కల్యాణ్
  • అన్నయ్యే తనకు తొలిగురువు అని వెల్లడి
టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోదరుడు చిరంజీవికి చిరాయువుతో కూడిన సుఖశాంతులు ఇవ్వాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. శ్రమైక జీవనమే చిరంజీవి విజయానికి సోపానం అని స్పష్టం చేశారు.

అన్నయ్య చిరంజీవి తను స్ఫూర్తి ప్రదాత అని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో, అన్నయ్య చిరంజీవి పట్ల కూడా అంతే పూజ్యభావం ప్రదర్శిస్తానని వెల్లడించారు. తనకు అన్నయ్యే తొలి గురువు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి... తెలుగువారు సగర్వంగా చిరంజీవి మావాడే అని చెప్పుకునేలా తనను తాను మలచుకున్నారని కొనియాడారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని గొప్పదనం అని, కొందరు ఆయనలా అభినయం ప్రదర్శించాలని స్ఫూర్తి పొందితే, మరికొందరు ఆయనలోని సేవా భావాన్ని చూసి స్ఫూర్తి పొందారని వివరించారు. అటువంటి కృషీవలుడికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టం అని పవన్ వ్యాఖ్యానించారు. తన సోదరుడి పుట్టినరోజు సందర్భంగా తెలుగువారందరూ ఆయన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
Chiranjeevi
Birthday
Wishes
Brother
Tollywood

More Telugu News