New Delhi: దాదాపు 30 శాతం మంది ఢిల్లీ వాసుల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు!

30 Percent People of Delhi Has Corona Anti Bodies
  • ప్రతి ముగ్గురిలో ఒకరికి వ్యాధిని ఎదుర్కునే శక్తి
  • మూడు వారాల వ్యవధిలో రెండు సార్లు సీరోలాజికల్ సర్వే
  • వివరాలు వెల్లడించిన సత్యేంద్ర జైన్
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతి ముగ్గురిలో ఒకరి శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు ముందుగానే ఉన్నాయని ప్రభుత్వం చేపట్టిన రెండో సీరోలాజికల్ సర్వేలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 29.1 శాతం మందిలో ముందుగానే కరోనా రోగ నిరోధక శక్తి ఉందని, వారిలో చాలామందికి కరోనా సోకి, లక్షణాలు కనిపించకుండానే వైరస్ నశించి పోయిందని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో నివసిస్తున్న సుమారు 58 లక్షల మంది ప్రజల్లో యాంటీ బాడీలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో తొలి దశ సర్వేతో పోలిస్తే, యాంటీ బాడీలు ఉన్న వారి శాతం 22.12 శాతం నుంచి 33.2 శాతానికి పెరిగింది. ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసులు సైతం 24 శాతం తగ్గాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి 40 శాతం దాటిన వారందరిలోనూ కరోనాను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు సిద్ధంగానే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని సత్యేంద్ర జైన్ తెలియజేశారు.

ఈ నెల తొలి వారంలో ఫస్ట్ సీరోలాజికల్ సర్వేను చేయగా, ఢిల్లీ ప్రజల్లో 23.48 శాతం ప్రజల్లో వ్యాధిని ఎదుర్కొనే శక్తి ఉందని వెల్లడైంది. ఆపై గత వారం జరిపించిన సర్వేలో వైరస్ ను ఎదుర్కొనే శక్తి ప్రజల్లో పెరిగిందని తేలడం గమనార్హం. సెప్టెంబర్, అక్టోబర్ లలో సైతం ఇదే విధమైన సర్వేను నిర్వహిస్తామని సత్యేంద్ర వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు జరిపించని వేళ, ఈ సీరోలాజికల్ సర్వే వైరస్ వ్యాప్తిపై దాదాపు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
New Delhi
Corona Virus
Survey
Serological
Antibodies

More Telugu News