Vijayashanti: కేసీఆర్ ప్రభుత్వ చేతగానితనానికి ఇప్పుడు వరంగల్ కూడా బలైపోయింది: విజయశాంతి

  • హైదరాబాద్ ను ఎలాగూ కాపాడలేకపోయారన్న విజయశాంతి
  • సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శలు
  • కేసీఆర్ వైఫల్యం గురించి గ్రంథమే రాయొచ్చంటూ వ్యాఖ్యలు
Vijayasanthi slams CM KCR over floods and corona conditions in Telangana

తెలంగాణ వ్యాప్తంగా వరద పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందనడానికి తాజా పరిణామాలే నిదర్శనం అని పేర్కొన్నారు. చినుకు పడితే జలమయం అయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారని, ప్రభుత్వ చేతగానితనంతో ఇప్పుడు వరంగల్ కూడా బలైపోయిందని తెలిపారు. పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న రైతన్నలను కనీస స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

అంతేకాకుండా, రాష్ట్రంలో కరోనా చికిత్స, నివారణ చర్యల తీరుతెన్నులపైనా విజయశాంతి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రధాన కొవిడ్ చికిత్సా కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి అనేక పర్యాయాలు అగ్నిప్రమాదానికి గురైందని, అయినప్పటికీ అక్కడి అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థ నీరుగారిపోయిన స్థితిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న రీతిలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక, తెలంగాణలో కరోనా చికిత్స దారుణంగా తయారైందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్సా వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అందుకు హైకోర్టు వేసిన మొట్టికాయలే సాక్ష్యమని తెలిపారు. సర్కారు తీరుపై డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో అసంతృప్తితో ఉన్నారని విజయశాంతి వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ దొరగారి పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయొచ్చని ఎద్దేవా చేశారు.

More Telugu News