Andhra Pradesh: అద్దెకుంటున్న ఇంట్లోనే భర్తను చంపి పూడ్చిపెట్టి.. ప్రియుడితో కలిసి మరోచోట సహజీవనం

Wife killed husband with the help of lover in Guntur dist
  • గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఘటన
  • భర్తను హతమార్చి రూ. 20 లక్షలతో ప్రియుడితో కలిసి పరార్
  • పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడి
గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. కట్టుకున్న భార్యే భర్తను చంపి, తాము అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పూడ్చిపెట్టి, ప్రియుడితో కలిసి మరోచోట సహజీవనం చేస్తున్న విషయం తెలిసి  షాకయ్యారు.

తన కుమారుడు చిరంజీవి కనిపించడం లేదంటూ చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి సుబ్బారావు వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చిరంజీవి భార్య కొల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది.

మూడు నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నిందితురాలు చెరుకుపల్లిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పూడ్చి వేసింది. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి కొల్లూరు వెళ్లి ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోంది. ఇంటూరుకు చెందిన యువతితో చిరంజీవికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొల్లూరులో చిరంజీవి మెడికల్ షాపు నిర్వహించేవాడు. ఈ క్రమంలో అతడి స్నేహితుడితో నిందితురాలికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

అదే సమయంలో చిరంజీవి ఓ ఇంటి స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ. 20 లక్షలను ఇంట్లో భద్రపరిచాడు. విషయం తెలిసిన భార్య, భర్తను హత్యచేసి పూడ్చిపెట్టి ఆ డబ్బు పట్టుకుని ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. చిరంజీవి హత్య కేసుతో ప్రమేయం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు రేపల్లె పోలీసులు తెలిపారు.
Andhra Pradesh
Guntur District
Cherukupally
Crime News

More Telugu News