MS Dhoni: పందెం కాయగలను... ధోనీ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు: గౌతమ్ గంభీర్

Gambhir Says he can bet On Dhoni Record Never Break
  • ధోనీ కెప్టెన్సీలో మూడు ఐసీసీ ట్రోఫీలు
  • సెంచరీల రికార్డులు భవిష్యత్తులో బద్దలు కావచ్చు
  • ధోనీ రికార్డు మరే కెప్టెన్ కూ సాధ్యం కాదు
  • క్రికెట్ కనెక్టెడ్ షోలో గౌతమ్ గంభీర్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అధికారికంగా తన కెరీర్ కు ముగింపు పలికాడు. న్యూజిలాండ్ లో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ధోనీ కెరీర్ లో ఆఖరి మ్యాచ్ గా మిగిలిపోయింది. జాతి యావత్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తూ, ధోనీ తన రిటైర్ మెంట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రెండురోజులైపోయింది. నిన్న స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 'క్రికెట్ కనెక్టెడ్' షోలో అతిథిగా పాల్గొన్న మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, ధోనీ ప్రస్తావన రాగా, కీలక వ్యాఖ్యలు చేశారు.

"ధోనీ పేరు చెబితే, ఓ రికార్డు గుర్తుకు వస్తుంది. అది ఎల్లకాలమూ ధోనీ పేరిటే నిలిచి వుంటుందని చెప్పగలను. ఈ విషయమై నేను పందెం కాయగలను. మూడు ఐసీసీ ట్రోఫీలను దేశానికి అందించిన ఘటన ధోనీదే. టీ-20 వరల్డ్ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2011 వరల్డ్ కప్ లను ధోనీ నేతృత్వంలోనే గెలిచాము. మరే కెప్టెన్ కూ ఇది సాధ్యం కాదని నమ్ముతున్నాను. సెంచరీల రికార్డులు ఏనాటికైనా బద్దలవుతాయి. భవిష్యత్తులో మరెవరైనా వచ్చి, డబుల్ సెంచరీల విషయంలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయవచ్చు. కానీ, భారత కెప్టెన్ గా ధోనీ సాధించిన రికార్డు పదిలంగా ఉండిపోతుంది" అన్నారు గంభీర్.
MS Dhoni
Gautam Gambhir
Record
Bet

More Telugu News