Ravi Shastri: లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎస్ ధోనీ... నీకు సెల్యూట్ చేస్తున్నాను: రవిశాస్త్రి

Ravi Shastri salutes MS Dhoni who announced retirement from international cricket
  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ
  • ఎవరెస్ట్ శిఖర సమానుడంటూ శాస్త్రి కితాబు
  • ప్రశాంత జీవనం గడపాలంటూ ఆకాంక్ష
టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంటు ప్రకటించడం పట్ల కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఏ విధంగా చూసినా ఎంఎస్ ధోనీ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తైన వాడని కొనియాడారు. నిన్న సాయంత్రం ఎలాంటి సంకేతాలు లేకుండానే ధోనీ నేరుగా తన రిటైర్మెంటు నిర్ణయాన్ని ప్రకటించేసరికి మీడియా, క్రికెట్ వర్గాలు, క్రీడాలోకం నివ్వెరపోయింది. తన పేరుకు తగ్గట్టుగా ఎలాంటి హంగామా లేకుండా ఎంతో కూల్ గా రిటైర్మెంటు ప్రకటన చేశాడు. దాంతో ధోనీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా ఓ వీడియో సందేశం వెలువరించారు.

"ధోనీ తనదైన శైలిలో అంతర్జాతీయ కెరీర్ ముగించాడు. సూర్యుడు అస్తమించడంతో మన స్వాతంత్ర్య దినం ముగిసినట్టయింది... అదే సమయంలో ధోనీ కూడా తన ప్రస్థానానికి వీడ్కోలు పలికాడు క్రికెట్ లో నికార్సయిన బాద్ షా అంటే ధోనీనే. ఎంతో ఒత్తిడి సమయాల్లోనూ ప్రశాంతంగా, నిగ్రహంతో ఉండడం ధోనీకే సాధ్యం. మ్యాచ్ ను అంచనా వేయడంలో దిట్ట.

ఓ నాయకుడిగా, జట్టు కెప్టెన్ గా ధోనీ ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు ఎదిగాడు. అన్ని ఫార్మాట్లలో వరల్డ్ కప్పులు, చాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు, ఐపీఎల్ టైటిళ్లు, చాంపియన్స్ లీగ్ అన్ని ధోనీ కీర్తికిరీటంలో చేరాయి. ఈ రిటైర్మెంట్ అనంతరం ధోనీ, సాక్షి, జివా అందరూ ఎంతో సంతోషపైన ప్రశాంత జీవనం గడపాలని ఆకాంక్షిస్తున్నాను. ధోనీ... ఐపీఎల్ సందర్భంగా మమ్మల్ని అందరినీ ఉర్రూతలూగిస్తావని ఆశిస్తున్నాను. లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎస్ ధోనీ... నీకు సెల్యూట్ చేస్తున్నాను" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు. ధోనీకి పారామిలిటరీ దళాల్లో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకు ఉన్న సంగతి తెలిసిందే.

Ravi Shastri
MS Dhoni
Retirement
International Cricket
Team India

More Telugu News