Adar Poonawalla: మరొక్క నాలుగు నెలలు... వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ!

Serum Institute Vaccine Launch in December
  • డిసెంబర్ లో వ్యాక్సిన్ విడుదల
  • ఈ నెలాఖరులోగా తయారీ మొదలు
  • 10 కోట్ల డోస్ లను అందిస్తామన్న సీరమ్ సీఈఓ
కరోనా వైరస్ కు విరుగుడుగా డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా వ్యాఖ్యానించారు. వాల్యూముల పరంగా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలను తయారు చేస్తున్న సంస్థగా ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనున్నదని 'సీఎన్బీసీ టీవీ 18'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ లో తమ సంస్థ వ్యాక్సిన్ ను విడుదల చేస్తుందని తెలిపారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ తయారీ ప్రారంభమవుతుందని, రెండు వారాల్లోనే ఐసీఎంఆర్ తో కలిసి తాము ట్రయల్స్ చేపడుతామని తెలిపారు.

కాగా, సీరమ్ ఇనిస్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, వ్యాక్సిన్ అలయన్స్ గావిలతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేసి, వాటిని ఇండియాతో పాటు ఇతర అల్పాదాయ దేశాలకు అందించాలని నిర్ణయించినట్టు అదార్ పూనావాలా తెలిపారు. ఇందుకోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్లను రిస్క్ ఫండింగ్ గా అందించింది కూడా.

ఈ నిధులతోనే సీరమ్, ఆస్ట్రాజెనికా, నోవావాక్స్ సిద్ధం చేసిన వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయనుంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ మూడవ దశలోకి ప్రవేశించగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తే మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే సీరమ్, తాను తయారు చేసిన డోస్ లను మార్కెట్లోకి పంపాల్సి వుంటుంది. వ్యాక్సిన్ ధర 3 డాలర్ల వరకూ ఉంటుందని వెల్లడించిన ఆయన, తుది ధరను రెండు నెలల్లోగా ఖరారు చేస్తామని అదార్ పూనావాలా తెలియజేశారు.
Adar Poonawalla
Serum Institute
Vaccine
Corona

More Telugu News