AP High Court: అమరావతి నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో ఆ వివరాలు కావాలన్న హైకోర్టు

AP High Court seeks Amaravathi expenditure details
  • అమరావతి పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
  • రూ.52 వేల కోట్ల వ్యయం జరిగిందన్న న్యాయవాది మురళీధర్
  • కట్టిన భవనాలు వాడకపోతే పాడైపోతాయన్న హైకోర్టు
అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రాజధాని నిధుల వ్యయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతూ హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు రూ.52 వేల కోట్లు ఖర్చు చేశారని న్యాయవాది మురళీధర్ సీఆర్డీఏ రికార్డులను కోర్టుకు సమర్పించారు.

ఈ సందర్భంగా, రూ.52 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? అంటూ కోర్టు ప్రశ్నించింది. దానికి సంబంధించిన సమగ్ర వివరాలు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. రాజధాని అమరావతి నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో ఆ వివరాలు కూడా అందించాలని కోరింది.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  అమరావతిలో వెచ్చించిన సొమ్ము ప్రజల సొమ్ము అని, వృథా అయితే రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తుందని పేర్కొంది. నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలను ఎవరూ వాడకుంటే అవి పాడైపోతాయని, ఆ నష్టం ఎవరు భరించాలని ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 14న ఉంటుందని వెల్లడించింది.
AP High Court
Amaravati
Expenditure
Details
Andhra Pradesh

More Telugu News