Kishan Reddy: తెలంగాణలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది.. ఈ నెలలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి: కిషన్‌రెడ్డి

kishan reddy on corona virus
  • టిమ్స్ లో వసతులపై ఆరా
  • రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను వేగంగా అమలు చేయాలి
  • ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి
  • ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో వసతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.  అందులో అందుతోన్న వైద్యం, వసతులను ఈ రోజు ఉదయం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టిమ్స్ లో వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు.

కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను వేగంగా అమలు చేయాలని సూచించారు. కొవిడ్‌-19ని కట్టడి చేస్తున్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత సర్కారుదేనన్నారు.

ఈ నెలలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని  సూచించారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని ఆయన చెప్పారు. దేశంతో పాటు రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. తాను ఈ రోజు నగరంలోని పలు ఆసుపత్రుల్లో పర్యటిస్తున్నానని అన్నారు. వైద్య సిబ్బందిని మరింత మందిని తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు.
Kishan Reddy
Telangana
Corona Virus

More Telugu News