Pawan Kalyan: నూతన విద్యావిధానాన్ని జనసేన స్వాగతిస్తోంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan says Janasena welcomes new educational system
  • మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన
  • నూతన విద్యావిధానానికి రూపకల్పన చేసిన కేంద్రం
  • మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జనసేన
ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలంటూ కేంద్రం నూతన విద్యావిధానానికి రూపకల్పన చేయడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని తెలిపారు. మాతృభాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని యునెస్కో 2008లోనే ప్రకటించిందని తెలిపారు. ఇటీవల ఏపీ సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది ఇందుకేనని స్పష్టం చేశారు.

అయితే, జనసేన ఇంగ్లీషు మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్నది తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేయాలని, ఇంగ్లీషు మీడియం ఓ ఆప్షన్ గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయం అని పవన్ స్పష్టం చేశారు.

తాజాగా, ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని నిర్ణయించిన కమిటీ సభ్యులకు, కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.
Pawan Kalyan
Education System
Narendra Modi
Janasena
English Medium
Andhra Pradesh
YSRCP

More Telugu News