Woman: తనకు దూరమయ్యాడని విషప్రయోగంతో జడ్జిని చంపేసిన మహిళ

 Woman planed to kill entire family of a judge in Madhya Pradesh
  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలితో జడ్జి సాన్నిహిత్యం
  • బదిలీపై వెళ్లిపోయిన జడ్జి
  • అతడి కుటుంబాన్ని చంపేందుకు మహిళ యత్నం
  • జడ్జితో పాటు కుమారుడు కూడా మృతి
మధ్యప్రదేశ్ లో ఓ మహిళ తనకు దూరమయ్యాడన్న కారణంతో ఓ జడ్జి కుటుంబాన్ని అంతం చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో జడ్జి, అతడి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్ర త్రిపాఠీ అనే న్యాయమూర్తి కొంతకాలం కిందట చింద్వారాలో పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు సంధ్యా సింగ్ తో పరిచయం ఏర్పడింది. సంధ్యా సింగ్ ఓ ఎన్జీవో నిర్వాహకురాలు. మహేంద్ర త్రిపాఠీ, సంధ్యా సింగ్ ల స్నేహం హద్దులు దాటింది. ఈ క్రమంలో జడ్జి మహేంద్ర త్రిపాఠీకి బేతుల్ జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జీగా బదిలీ అయింది. సంధ్యా సింగ్ తో సంబంధాన్ని తెంచుకుని ఆయన కుటుంబంతో సహా బేతుల్ జిల్లాకు వెళ్లిపోయారు.

అయితే సంధ్యా సింగ్ ఈ పరిణామాలతో తీవ్ర అసహనంతో రగిలిపోయింది. జడ్జి మహేంద్ర త్రిపాఠీ తనతో సంబంధం కొనసాగింపుకు మొగ్గు చూపకపోవడంతో సంధ్యా సింగ్ ఓ విషపు ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మహేంద్ర త్రిపాఠీ కుటుంబాన్ని తుదముట్టించాలని ప్లాన్ చేసి అమల్లో పెట్టింది. త్రిపాఠీ కుటుంబ సమస్యలను తన కుట్రకు అనుకూలంగా మలుచుకుంది. త్రిపాఠీ సమస్యలన్నీ తొలగిపోయేందుకు ఓ ప్రత్యేక పూజ చేయిస్తానని, పూజ కోసం గోధుమపిండి ఇమ్మని కోరింది. ఆ మంత్రించిన గోధుమపిండితో చపాతీలను చేసుకుని తింటే సమస్యలన్నీ తొలగిపోతాయని త్రిపాఠీని నమ్మించింది.

నిజమేనని నమ్మిన జడ్జి త్రిపాఠీ గోధుమ పిండి తెచ్చివ్వగా, దాంట్లో విషం కలిపి ఇచ్చింది. దాంతో చేసిన చపాతీలను త్రిపాఠీ, అతని కుమారులు మాత్రమే తినగా, భార్య తినలేదు. ఆ చపాతీల్లో విషం ఉండడంతో జడ్జి, ఆయన పెద్ద కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు. తమను ఆసుపత్రిలో చేర్చే సమయంలో జడ్జి చపాతీల విషయం చిన్న కుమారుడితో చెప్పడంతో సంధ్యా సింగ్ పై అనుమానం కలిగింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించడంతో కుట్ర బట్టబయలైంది. ఈ వ్యవహారంలో సంధ్యాసింగ్ తో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Woman
Judge
Poison
Death
Madhya Pradesh

More Telugu News