Pawan Kalyan: అన్నయ్య సినిమాల్లో రావి కొండలరావు పోషించిన పాత్రలు అందరికీ గుర్తే: పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences senior actor and writer Ravi Kondala Rao demise
  • నటుడు రావి కొండలరావు కన్నుమూత
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్
  • ఆయన బహుముఖ సేవలు అజరామరం అంటూ వ్యాఖ్యలు
తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ నటుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్న రావి కొండలరావు ఈ సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాదులో గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రావి కొండలరావు మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు అంటూ విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు బహుముఖ సేవలు అందించిన ఆయన, నటుడిగా రంగస్థలానికి కూడా సేవలు అందించారని, నాటక రచయితగా, పాత్రికేయుడిగా సినీ జర్నలిజానికి ఆయన సేవలు మరపురానివని తెలిపారు.

"ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమతో అనుబంధం కలిగి ఉన్నారు. విజయ సంస్థతోనూ, బాపు-రమణలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన నటుడిగా, రచయితగా ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశారు. అన్నయ్య చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయి వంటి చిత్రాల్లో రావి కొండలరావు పోషించిన పాత్రలు అందరికీ గుర్తే. పోయినేడాది ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయనతో మాట్లాడాను. సినీ రంగ ప్రస్థానంలో మలుపుల గురించి చర్చించుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రావి కొండలరావు కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను" అంటూ పవన్ ప్రత్యేక ప్రకటన వెలువరించారు.
Pawan Kalyan
Ravi Kondala Rao
Death
Chiranjeevi
Tollywood

More Telugu News