Kurnool District: తెల్లారితే పెళ్లి.. వధువుకు కరోనా.. ఆగిన వివాహం
- కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఘటన
- చేసేది లేక పెళ్లిని వాయిదా వేసిన ఇరు కుటుంబాలు
- తూర్పుగోదావరి జిల్లాలో వరుడికి కరోనా
తెల్లవారితే పెళ్లి జరగాల్సి ఉండగా వధువుకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వివాహం ఆగిపోయింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగిందీ ఘటన. స్థానిక చెంచుకాలనీకి చెందిన యువతికి ఈ నెల 25 వివాహం నిశ్చయమైంది. అయితే, కొవిడ్ నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులిద్దరూ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. నిన్న ఉదయం వచ్చిన రిపోర్టుల్లో వధువుకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అధికారులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఇరు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి తంతులో భాగంగా గురువారం యువకుడిని పెళ్లి కుమారుడిని చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదే సమయంలో అతడికి కరోనా సోకినట్టు రిపోర్టులు రావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. కాగా, నందికొట్కూరులో ఈ నెల 22న కోటా హైస్కూలు వద్ద 378 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా, వీరిలో 100 మందికి వైరస్ సంక్రమించినట్టు రిపోర్టుల్లో నిర్ధారణ అయింది.