Bengaluru: ఇంకా లభించని సింధూజ ఆచూకీ.. గాలింపు నిలిపేసిన అధికారులు

not yet trace sindhuja who washed out with car in a canal
  • బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తూ వాగులో గల్లంతు
  • సింధూజ భర్త, అతడి స్నేహితుడు సేఫ్
  • వాగుకు 200 మీటర్ల దూరంలో ముళ్లపొదల్లో కారు
బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలోని వాగులో కారుతో సహా కొట్టుకుపోయిన సింధూజ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిన్న సాయంత్రం ఏడు గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఆ తర్వాత నిలిపివేశారు. సింధూజ ఉన్న కారు వాగుకు 200 మీటర్ల దూరంలో ముళ్లపొదల్లో చిక్కుకుపోగా, ఆమె హ్యాండ్ బ్యాగ్ మాత్రం లభించింది. సింధూజ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శివశంకర్‌రెడ్డి, సింధూజ భార్యాభర్తలు. ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. స్నేహితుడైన జిలాన్‌బాషాతో కలిసి శుక్రవారం రాత్రి వీరు కారులో హైదరాబాద్ బయలుదేరారు. అడ్డదారిలో సులభంగా హైదరాబాద్ వెళ్లొచ్చని భావించి నిన్న తెల్లవారుజామున కర్నూలు దాటిన తర్వాత రహదారి దిగి పుల్లూరు, కలుగొట్ల మీదుగా ప్రయాణం సాగించారు.

కలుగొట్ల శివారులోని వాగు రోడ్డుపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహాన్ని సరిగా అంచనా వేయలేకపోయిన వారు అలాగే కారును ముందుకు పోనిచ్చారు. అయితే, కొంతదూరం వెళ్లాక కారు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కారు నడుపుతున్న జిలాన్‌బాషా, శివశంకర్‌రెడ్డి కిందికి దిగారు. వెనక సీట్లో నిద్రపోతున్న సింధూజను బయటకు తీసేందుకు ప్రయత్నించగా కారు డోర్ తెరుచుకోలేదు. ఈలోగా కారు నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఆమె హ్యాండ్‌బ్యాగ్ తప్ప ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటికే సాయంత్రం ఏడు గంటలు కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. 
Bengaluru
Hyderabad
Kurnool District
Canal
Kadapa District
Sindhuja

More Telugu News