Donald Trump: కరోనా వ్యాక్సిన్ అందరికంటే ముందే తీసుకోవాలా? లేక ఆఖరులో తీసుకోవాలా?... సందిగ్ధంలో ట్రంప్!

Trump in confusion to take corona vaccine first or last
  • ముందే వ్యాక్సిన్ తీసుకుంటే విమర్శిస్తారంటున్న ట్రంప్
  • ఆఖర్లో తీసుకుంటే వ్యాక్సిన్ లో పసలేదని భావిస్తారని వెల్లడి
  • ఫైజర్ తో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, అందరికంటే ముందే వ్యాక్సిన్ వేయించుకోవాలా, లేక ఆఖరులో వేయించుకోవాలా అనేది తేల్చుకోలేకపోతున్నానని తెలిపారు. వ్యాక్సిన్ మొదట్లోనే వేయించుకుంటే పచ్చి స్వార్థపరుడు అంటారని, చివర్లో వేయించుకుంటే... ఆ వ్యాక్సిన్ లో పెద్దగా పసలేదు కాబట్టే ఆఖర్లో వేయించుకుంటున్నాడని అంటారని ట్రంప్ తన డైలమాకు గల కారణాలను వివరించారు.  

"కరోనా వ్యాక్సిన్ కోసం ముందు నిలుచున్నానంటే అందరికంటే ముందే వ్యాక్సిన్ కోసం వెంపర్లాడుతున్నాడు అంటారు. అదే సమయంలో నన్ను కొందరు పొగుడుతారు కూడా. వ్యాక్సిన్ వేయించుకునేందుకు అందరికంటే ధైర్యంగా ముందుకొచ్చాడని అభినందిస్తారు. అందుకే ప్రజలు నన్ను మొదటే వ్యాక్సిన్ తీసుకోమంటారో, లేఖ ఆఖర్లో తీసుకుంటే మంచిదని చెబుతారో దానికే కట్టుబడి ఉంటా" అంటూ ట్రంప్ తన మనోభావాలను వెల్లడించారు.

ఫైజర్ కంపెనీ తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా 100 మిలియన్ డోసుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబరు నాటికి ఈ వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
Donald Trump
Corona Virus
Vaccine
USA
Pfizer

More Telugu News