Fake News: భారత యుద్ధ విమానాన్ని నేపాల్ కూల్చివేసిందంటూ ప్రచారం... ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసిన కేంద్రం

  • నేపాల్ పై భారత్ దాడి అంటూ ప్రచారం
  • ఇద్దరు భారత పైలెట్ల మృతి అని వెల్లడి
  • అవి పాత ఫొటోలు అంటూ కేంద్రం స్పష్టీకరణ
Centre clarifies on a fake news that Nepal shot down a Indian jet

సోషల్ మీడియాలో నిజం కంటే అవాస్తవాలే అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంటాయి! ఫేక్ న్యూస్ లు నిజమని నమ్మి వాటిని షేర్ చేసేవారు ఎంతోమంది ఉంటారు. అసలు వార్తల కంటే ఇలాంటి ఫేక్ న్యూస్ లను వైరల్ చేస్తుంటారు. తాజాగా, భారత యుద్ధ విమానం కూల్చివేత అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. వైమానిక దాడులు చేసేందుకు భారత యుద్ధ విమానం ఒకటి నేపాల్ సరిహద్దులు దాటి వచ్చిందని, ఆ భారత యుద్ధ విమానాన్ని నేపాల్ కూల్చివేసిందని ఆ వార్త సారాంశం.

కోట్ ఖరాక్ సింగ్ పెర్నవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, భారత్ వైమానిక దాడులకు ప్రతిగా నేపాల్ కూడా దీటుగా స్పందించి ఓ జెట్ ఫైటర్ ను కూల్చివేసిందని, ఇద్దరు భారత పైలెట్లు మృతి చెందారని ఆ వార్తలో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర సమాచార శాఖ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. భారత వైమానిక దళం ఏ పొరుగుదేశంపైనా దాడికి పాల్పడలేదని, వైరల్ అవుతున్న వార్తలోని ఫొటోలు పాతవి అని, దుష్ప్రచారం చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.


More Telugu News