Kurnool District: సోషల్ మీడియా ఖాతాల నుంచి అమ్మాయిల ఫొటోల సేకరణ.. ఆపై మార్ఫింగ్ చేసి రూ. లక్షల డిమాండ్

  • ఫొటోలు సేకరించి నగ్నంగా మార్చి వాట్సాప్
  • యువతి ఫిర్యాదుతో కటకటాల వెనక్కి
  • నిందితుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి
Hyderabad ccb police arrested man for photo morphing

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లోని అమ్మాయిల ఫొటోలు సేకరించి వాటిని నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే, ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్ అహ్మద్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు  సంస్థలో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలోని యువతుల ఖాతాల నుంచి వారి ఫొటోలు, ఫోన్ నంబర్లు సేకరించేవాడు. అనంతరం ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి వారి వాట్సాప్‌కు పంపించి డబ్బులు కావాలని బెదిరించి తీసుకునేవాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ యువతికి కూడా ఇలానే నగ్న ఫొటోలు పంపగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అహ్మద్‌ను నిన్న అరెస్ట్ చేశారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లలో 50 మందికిపైగా యువతుల వివరాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6, రాచకొండ కమిషనరేట్‌లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News