vaccine: ఈ ఏడాదిలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఛాన్స్‌ లేదు: డబ్ల్యూహెచ్‌వో

vaccine not possible in 2020
  • ఈ ఏడాది వ్యాక్సిన్‌ వస్తుందని ఊహాగానాల నేపథ్యంలో ప్రకటన
  • పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి
  • ఏ ఒక్కటీ విఫలం కాకపోవడం శుభపరిణామం
  • బడుల పునఃప్రారంభం సరికాదు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రయల్స్‌ను కూడా నిర్వహిస్తూ సానుకూల ఫలితాలు వచ్చాయంటూ ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో  ఈ ఏడాదిలోపే వ్యాక్సిన్‌ వస్తుందని ఊహాగానాలు మొదలవుతున్నాయి. అయితే, 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో టీకా అందుబాటులోకి వచ్చే  అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  

డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగ అధిపతి మైక్‌ ర్యాన్ మీడియాతో మాట్లాడుతూ...‌ ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, కొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయని గుర్తు చేసింది. ఏ ఒక్కటీ విఫలం కాకపోవడం శుభపరిణామమని తెలిపింది. వ్యాక్సిన్‌ వచ్చాక పంపిణీలో ఎలాంటి తారతమ్యాలు ఉండవని చెప్పారు.

కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న అమెరికాతో పాటు పలు దేశాల్లో బడుల పునఃప్రారంభం సరికాదని ఆయన చెప్పారు. కరోనా సామాజిక వ్యాప్తి నియంత్రణలోకి వచ్చే వరకు విద్యా సంస్థలు తెరవకపోవడమే మంచిదని తెలిపారు.

కాగా, రష్యాలోని సెషనోవ్‌ యూనివర్సిటీ టీకా ఆగస్టులోనే వస్తుందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. చైనాలో మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని కథనాలు వస్తున్నాయి. భారత్‌ బయోటెక్ కూడా‌ కోవాగ్జిన్‌ తొలి దశ మానవ ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలోపే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
vaccine
WHO
Corona Virus
COVID-19

More Telugu News