GVL Narasimha Rao: ఇళ్ల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. ఢిల్లీలో బీజేపీ-జనసేన సంయుక్త ధర్నాలో పాల్గొంటున్నాను: జీవీఎల్‌

  • ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ ధరలు పెంచింది
  • పేదల ఇళ్ల నిర్మాణాలని జాప్యం చేసింది
  • కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఫలాలను లబ్ధిదారులకు అందించలేదు
  • ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చాలి
GVL on ysjagan  governments claim

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ-జనసేన సంయుక్త ధర్నాలో భాగంగా ఢిల్లీలోని తన స్వగృహం వద్ద ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తాను నిరసన తెలుపుతున్నట్లు బీజేపీ నేత జీవీఎఎల్ నరసింహారావు చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ కూడా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
 
ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ ధరలు పెంచి, నిర్మాణాలని జాప్యం చేసిందని జీవీఎల్ విమర్శలు గుప్పించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అవలేదని, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఫలాలను లబ్ధిదారులకు అందించలేదని చెప్పారు. గత ఆరేళ్ల కాలంలో 20 లక్షల ఇళ్లు ఏపీకి కేటాయించి, పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే ప్రధాని మోదీ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆ ఆరోపణలపై ఎందుకు స్పందించలేదో, చర్యలు ఎప్పుడు తీసుకుంటారో కూడా ప్రజలకు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.  
 
తమ పాలనాకాలంలో నిర్మించిన గృహాలను ఎందుకు పంపిణీ చేయలేదని ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబు నాయుడు తమ హయాంలో పూర్తి సంఖ్యలో ఇళ్లను నిర్మించి ఉంటే ఎందుకు పంపిణీ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా జీవీఎల్ నిలదీశారు.  

ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 300 చదరపు అడుగుల గృహాల నిర్మాణానికి ఎంత వెచ్చించారో, నిర్మాణం  ఎప్పుడు పూర్తి చేస్తారో, లబ్ధిదారులకు ఎప్పుడు అందచేస్తారో స్పష్టంగా వివరణ ఇవ్వాలని అన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి విషయానికి వస్తే, 300 చ.అ. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా తమ ప్రభుత్వమే భరిస్తుందని ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మర్చిపోయారు. మొత్తానికి రెండు ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు అందనీయకుండా అన్యాయం చేస్తూ, వారిని శాశ్వతంగా పేదరికంలోనే ఉంచుతున్నాయి. అందరికీ సొంత ఇళ్లు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి' అని జీవీఎల్ విమర్శించారు. 

More Telugu News