India: సముద్రతల విధుల్లో ఉండే మిగ్-29కే, పీ-81 విమానాలు లడఖ్ కు తరలింపు!

India deploys navy war planes at Ladakh
  • సరిహద్దుల్లో భారీ ఆయుధ మోహరింపులు
  • అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్న కేంద్రం
  • అండమాన్ వద్ద కూడా యుద్ధ సన్నద్ధత
చైనాతో సరిహద్దు వ్యవహారం ఎప్పుడైనా నివురుగప్పిన నిప్పులాంటిదే. ఎప్పుడు భగ్గుమంటుందోనన్న నేపథ్యంలో, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఎంతో అప్రమత్తంగా ఉంటోంది. లడఖ్ సమీపంలోని ఎల్ఏసీ నుంచి చైనా బలగాలు వెనుదిరిగాయని చెబుతున్నా, భారత్ మాత్రం ఉదాసీనత కనబర్చరాదని భావిస్తోంది. అందుకే, సముద్రతల విధులు నిర్వర్తించే మిగ్-29కే, పోసిడాన్-81 విమానాలను లడఖ్ లో మోహరించింది. ఈ రెండు నేవీ అధీనంలో ఉండే విమానాలు. మిగ్-29కే సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ కాగా, పీ-81 లాంగ్ రేంజ్ గస్తీ విమానం.

భారత ప్రాదేశిక సముద్రజలాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే పీ-81 వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈ విమానం అందించే సమాచారంతో దాడులు చేయడానికి భారత నేవీ మిగ్-29కేలను ఉపయోగిస్తుంది. ఇప్పుడీ విమానాలను భూతల విధుల కోసం ఉపయోగిస్తున్నారు. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలపై ఓ కన్నేయడానికి వీటిని రంగంలోకి దించారు.

ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలు, డ్రోన్లు నిఘా పనుల్లో నిమగ్నమైనా, వాటికి అదనంగా పీ-81లను కూడా మోహరించాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ అమెరికా తయారీ విమానంలో అధికభాగం రాడార్ యంత్రాంగం, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్ వ్యవస్థలే ఉంటాయి. శత్రుదేశాల యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఎక్కడున్నా వెతికి, వెంటాడడం వీటి పని. ఇక సరిహద్దు విధుల్లో ఇప్పటికే సుఖోయ్-30ఎంకేఐ, మిరేజ్-2000, మిగ్-29 వంటి పోరాట విమానాలు ఉన్నా, నేవీకి చెందిన మిగ్-29కేల సేవలను కూడా ఉపయోగించుకోవాలని వాయుసేన భావిస్తోంది.

ఇవేకాకుండా అపాచీ పోరాట హెలికాప్టర్, చినూక్ వంటి భారీ రవాణా హెలికాప్టర్లు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాయి. అంతేకాదు, ఒకవేళ యుద్ధం సంభవిస్తే చైనా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బకొట్టేందుకు అండమాన్ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మకంగా మోహరింపులు చేపట్టింది. మలక్కా జలసంధి గుండా చైనా సాగించే వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు భారత్ 10 వరకు జాగ్వార్ సముద్ర పోరాట విమానాలను సిద్ధంగా ఉంచింది. వీటికి నౌకలను తుత్తునియలు చేసే హార్పూన్ మిసైళ్లు అమర్చి ఉంటాయి.
India
Mig-29k
P-81
Navy
Ladakh
China

More Telugu News