Hyderaabad: ఎన్నిసార్లు టెస్టు చేయించుకున్నా నెగటివ్.. చివరిగా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిన కొన్ని గంటలకే మృతి చెందిన బంజారాహిల్స్ ఏఎస్సై!

Banjarahills ASI Died with Covid after he tests negative thrice
  • మూడుసార్లు చేయించుకున్నా నెగటివే..
  • నగరంలోని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం
  • చివరికి అపోలోలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌ ఈ నెల 7న నేచర్‌క్యూర్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ తర్వాత శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడాయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు గుర్తించారు. దీంతో తిరిగి ఆయన నేచర్‌క్యూర్‌కు వెళ్లగా, అక్కడ ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడంతో గాంధీకి రెఫర్ చేశారు.

గాంధీ ఆసుపత్రికి వెళ్లిన ప్రేమ్‌కుమార్‌కు అక్కడా నిరాశే ఎదురైంది. రిపోర్టుల్లో కరోనా నెగటివ్ అని ఉండడంతో చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో కింగ్‌కోఠిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే, అక్కడ ఆక్సిజన్ మధ్యలోనే అయిపోవడంతో ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోకుండా ఆక్సిజన్ అందించి వదిలేశారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి దాటాక తిరిగి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పల్స్ అప్పటికే పడిపోవడంతో చేర్చుకుని చికిత్స మొదలుపెట్టారు.

ఈలోపు విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారుల సూచనతో ప్రేమ్‌కుమార్‌ను సోమవారం కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా నెగటివ్ అనే తేలింది. దీంతో బుధవారం మరోమారు పరీక్షలు నిర్వహించగా గురువారం వచ్చిన ఫలితాల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అప్పటికే వెంటిలేటర్‌పై ఉన్న ఏఎస్సై అదే రోజు రాత్రి మృతి చెందారు.
Hyderaabad
corona virus
Banjara Hills
ASI

More Telugu News