AP High Court: నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ: జగన్‌ సర్కారుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

high court fire on ap govt
  • కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వాదనలు
  • సుప్రీంకోర్టులోనూ హైకోర్టు తీర్పుపై స్టే రాలేదని తెలిపిన నిమ్మగడ్డ
  • రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని వ్యాఖ్య
  • గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలన్న కోర్టు
నిమ్మగడ్డ రమేశ్‌‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తొలగిస్తూ‌ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో దానిపై సరిగ్గా స్పందించని ప్రభుత్వ తీరుపై నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినా అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదని రమేశ్‌ కుమార్‌ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు.

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని చెప్పారు. దీంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని న్యాయస్థానం సూచించింది.  

అయితే, గవర్నర్‌ను కలిసేందుకు ఇప్పటికే సమయం కోరామని అశ్వనీకుమార్‌ కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ... తమ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ సర్కారుని హైకోర్టు ఆదేశించి, ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
AP High Court
Jagan
Andhra Pradesh
Nimmagadda Ramesh

More Telugu News