Corona Virus: ప్రయోగాల్లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో కరోనా నుంచి రెట్టింపు రక్షణ!

  • తొలి దశ ప్రయోగాలు సక్సెస్
  • యాంటీ బాడీలతో పాటు టీ-సెల్స్ తయారీ
  • సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశాలు
  • వెల్లడించిన బెర్క్ షైర్ ప్రతినిధి డేవిడ్ కార్పెంటర్
Double Protection With Oxford Vaccine

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్,  తొలి దశ ప్రయోగాల్లో విజయవంతమైంది. ఈ వైరస్ తీసుకున్న వారికి మహమ్మారి నుంచి రెట్టింపు రక్షణ లభించిందని ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. శరీరంలో యాంటీ బాడీలను పెంచడంతో పాటు కరోనా కణాలను హతమార్చే 'టీ-సెల్స్' శరీరంలో ఉత్పత్తి అయ్యేలా ఇది ప్రేరేపిస్తోందని తెలియజేశారు.

తమ ప్రయోగాల్లో 'టీ-సెల్స్' అత్యంత కీలకాంశమని, శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు కొన్ని నెలల కాలంలోనే సమసిపోతుండగా, టీ-సెల్స్ మాత్రం సంవత్సరాల తరబడి రక్తంలో ఉంటాయని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎంతకాలం పాటు రక్షణ లభిస్తుందన్న విషయం రుజువు కాలేదు.

ఆక్స్ ఫర్డ్ టీకా ప్రక్రియ సరైన దశలోనే సాగుతోందని వెల్లడించిన బెర్క్ షైర్ పరిశోధక నైతిక విలువల కమిటీ చైర్మన్ డేవిడ్ కార్పెంటర్, ఇంకా ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉందని, వ్యాక్సిన్ ఎప్పటిలోగా మానవాళికి అందుబాటులోకి వస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేమని, ఒక్కోసారి ఊహించని పరిణామాలు కూడా ఏర్పడవచ్చని అన్నారు. దిగ్గజ ఔషధ కంపెనీలతో కలిసి పనిచేస్తున్న కారణంగా సెప్టెంబర్ నాటికి టీకా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ టార్గెట్ ను అందుకునేందుకు ఆక్స్ ఫర్డ్ శ్రమిస్తోందని అన్నారు.

కాగా, సీహెచ్ఏడీఓఎక్స్ 1 ఎన్ కోవ్-19 పేరిట ఆక్స్ ఫర్డ్ అనుబంధ జెన్నర్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనికా, బ్రిటన్ సర్కారు తమవంతు సహకారాన్ని అందించడంతోనే వ్యాక్సిన్ శరవేగంగా తయారైంది. ప్రస్తుతం వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభం కాగా, కొన్ని వేల మందికి దీన్ని ఇచ్చి పరిశీలించనున్నారు.

More Telugu News