Telangana: 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana govt transfer 15 IAS Officers
  • ఉత్తర్వులు జారీ చేసిన సోమేశ్ కుమార్
  • ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్థానంలో ముర్తజా రిజ్వీ
  • నాగర్ కర్నూలు కలెక్టర్‌గా ఎల్.శర్మన్
పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారిని బదిలీ చేసి ఆ స్థానంలో ఢిల్లీలో తెలంగాణ భవన్‌ ఓఎస్డీగా ఉన్న ముర్తజా రిజ్వీకి బాధ్యతలు అప్పగించారు. శాంతికుమారిని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం  నియమించింది.

సాగునీటి పారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ బాధ్యతలను అదనంగా చూడనున్నారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితా రాణాను బదిలీ చేసి ఆ స్థానంలో వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీకేరికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

అలాగే, రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాశ్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐ.రాణి కుమిదిని, ఈపీటీఆర్ఐ డైరెక్టర్‌ జనరల్‌గా అదర్ సిన్హా, నాగర్ కర్నూలు కలెక్టర్‌గా ఎల్.శర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఎ.శ్రీదేవసేన, పర్యాటక శాఖ కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజు, ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా టి. విజయ్ కుమార్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇ.శ్రీధర్‌లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana
IAS Officers
Transfer

More Telugu News