Covid Party: తనకు కరోనా వచ్చిందంటూ పార్టీ ఇచ్చిన వ్యక్తి... హాజరైన యువకుడు కరోనా సోకి మృతి!

  • అమెరికాలో విచ్చలవిడి సంస్కృతి
  • పార్టీలు ఇస్తున్న కరోనా పాజిటివ్ వ్యక్తులు
  • ఏమవుతుందో చూద్దామని వెళుతున్న యువతీయువకులు
Man attends covid party and died in hospital with corona

అమెరికా సంస్కృతి స్వేచ్ఛా ప్రధానమైనది. తామనుకున్నది చేయడం అక్కడి వారి నైజం. యావత్ ప్రపంచాన్ని కరోనా రక్కసి వణికిస్తున్న తరుణంలో అమెరికాలో మాత్రం కరోనా అంటే లెక్కచేయని పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వచ్చిన వాళ్లు తమకు పాజిటివ్ వచ్చిందంటూ సంతోషంగా పార్టీలు ఇవ్వడం ఒక వింత పోకడ అయితే... వైరస్ సోకితే ఎలా ఉంటుందో చూద్దామంటూ యువత ఆ పార్టీలకు వెళుతుండడం మరో వింత! తాము కరోనాను గెలవగలమో, లేమో అని పరీక్షించుకునేందుకు ఆ పార్టీలకు వెళుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.

టెక్సాస్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు ఇలాంటి పార్టీకే వెళ్లి కరోనా బారినపడ్డాడు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇటీవల ఓ వ్యక్తి తనకు కరోనా సోకిందంటూ సన్నిహితులందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి వెళ్లిన సదరు యువకుడికి తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. తనను కరోనా ఏమీ చేయలేదంటూ ధీమా వ్యక్తం చేసిన ఆ యువకుడు శాన్ ఆంటోనియోలోని మెథడిస్ట్ హాస్పిటల్ బెడ్ పై అత్యంత దయనీయ స్థితిలో మృత్యువాత పడ్డాడు.

మరణానికి ముందు ఆ యువకుడు పార్టీకి వెళ్లి తప్పు చేశానని భావిస్తున్నట్టు డాక్టర్లకు చెప్పాడట. యువత అయినా, మరెవరైనా కరోనాతో చెలగాటం వద్దని, నిర్లక్ష్యానికి మూల్యం ఒక్కోసారి ప్రాణాలే కావొచ్చని అమెరికా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

More Telugu News