Auto: ఈ ఆటోలో ఎన్ని సౌకర్యాలో..!.. అచ్చెరువొందిన ఆనంద్ మహీంద్రా

Mumbai auto with all facilities attracts attention
  • కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆటోలో ఏర్పాట్లు
  • ఆటోలో వాష్ బేసిన్, టీవీ, వైఫై ఏర్పాట్లు
  • మొక్కలు, చెత్త బుట్టలకూ ఆటోలో స్థానం
ముంబయి రోడ్లపై పరుగులు తీసే ఓ ఆటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సైతం ఈ ఆటోను చూసి ముగ్ధుడయ్యారు. ప్రస్తుత కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఉండడమే ఈ ఆటో ప్రత్యేకత. ఈ ఆటోను నడిపే డ్రైవర్ పేరు సత్యవాణ్ గైట్. ఎంతో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అందుకే ఇప్పటివరకు అవసరాలకు తగిన విధంగా, ప్రజల క్షేమాన్ని కోరి తన ఆటోను ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు.

ఈ ఆటోలో ఎక్కే ప్రయాణికులు శానిటైజ్ చేసుకునేందుకు వీలుగా చిన్న వాష్ బేసిన్, శానిటైజర్లు, హ్యాండ్ వాష్, మినీ వాటర్ ట్యాంక్ ఉన్నాయి. పర్యావరణ హితం కోరుకుంటూ సత్యవాణ్ గైట్ కొన్ని మొక్కలకు కూడా తన ఆటోలో చోటు కల్పించాడు. పొడి చెత్త, తడి చెత్త వేసేందుకు రెండు వేర్వేరు డస్ట్ బిన్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇంతేనా అనుకోవద్దు... వైఫై సౌకర్యం, ఓ చిన్న టీవీ, బ్లూటూత్ కనెక్షన్ లో స్పీకర్, మంచినీళ్లు, కూలింగ్ ఫ్యాన్ ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఆటోకు వెలుపల భాగంలో స్వచ్ఛ భారత్ ప్రచారానికి సంబంధించిన వాక్యాలు దర్శనిమిస్తాయి. సత్యవాణ్ తన ఆటోలో వృద్ధులకు కిలోమీటర్ లోపల ఉచితప్రయాణం అందిస్తున్నాడు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పంచుకున్నారు.
Auto
Facilities
Corona Virus
Anand Mahindra
Twitter

More Telugu News