East Godavari District: భర్త కరోనా రోగి అని తెలియడంతో మధ్యలోనే బస్సు నుంచి దింపివేత.. భర్తను వదిలేసి భార్య పరార్!

wife gone missing after husband tested positive
  • డయాలసిస్ రోగికి కరోనా పరీక్షలు
  • పరీక్షలు రాకముందే బస్సెక్కిన బాధితుడు
  • ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించిన వైద్యులు
బస్సెక్కిన ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం తెలిసిన సిబ్బంది అతడిని బస్సు నుంచి దింపివేయగా, అతడితోపాటు ఉన్న భార్య అతడిని రోడ్డుపైనే వదిలేసి పరారైంది. తూర్పుగోదావరి జిల్లా కరపలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రపురానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాకినాడ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్న బాధితుడు నిన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి భార్యతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు కాకినాడలో ఆర్టీసీ బస్సెక్కాడు. బస్సులో ఆర్టీసీ సిబ్బంది అతడి వివరాలను నమోదు చేసుకున్నారు.

బస్సు కరప చేరుకుంటుందనగా బాధితుడికి కరోనా సోకినట్టు రిపోర్టులు వచ్చాయి. రిపోర్టులు వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించినా వినిపించుకోకుండా వారు బస్సెక్కి వచ్చేశారు. దీంతో వారు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించగా, వారు బస్సు డ్రైవర్, కండక్టర్‌కు విషయం చెప్పి వారిని బస్సు నుంచి దించేయాలని సూచించారు. అప్పటికే బస్సు కరప మార్కెట్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ భార్యాభర్తలిద్దరినీ దింపేశారు. అయితే, భర్తతోపాటు బస్సు దిగిన భార్య కనిపించకుండా పోవడంతో బాధితుడు అక్కడే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కనిపించకుండా పోయిన అతడి భార్య కోసం గాలిస్తున్నారు.
East Godavari District
Karapa
Corona Virus

More Telugu News