Telangana: ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుందామంటూ కేసీఆర్‌కు కాంగ్రెస్ నేతల లేఖ

  • లేఖ రాసిన వంశీచంద్‌రెడ్డి, కోదండరెడ్డి  
  • ప్రాజెక్టు ఎత్తు పెంచితే 130 టీఎంసీ నీటిని కోల్పోయే ప్రమాదం
  • దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆవేదన
congress writes letter to kcr about almatti project

ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును సమష్టిగా అడ్డుకుందామంటూ ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ ‌రెడ్డి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంయుక్త లేఖ రాశారు. ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కేంద్రం అనుమతులు కోరినట్టు కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కి హోలి స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన నేతలు.. వారి ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందేనని అన్నారు. ఆల్మట్టి ఎత్తును ఇప్పుడున్న 519.6 మీటర్ల ఎత్తు నుంచి 524.2 మీటర్ల ఎత్తుకు పెంచితే తెలంగాణకు రావాల్సిన 130 టీఎంసీల నీటిని కూడా అదనంగా వాడుకునే వెసులుబాటు కర్ణాటకకు లభిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు.

కృష్ణా నదిపై తెలంగాణలో నిర్మించిన జూరాల, నాగార్జున సాగర్, ఏపీలోని శ్రీశైలం ప్రాజెక్టులు వరదల సమయంలోనే నిండుతాయని, ఆల్మట్టి ఎత్తు పెరిగితే కనుక 130 టీఎంసీల వరద నీటిని నిల్వ చేసుకునే వీలు కర్ణాటకకు కలుగుతుందని వివరించారు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఆల్మట్టి ఎత్తు 518.7 మీటర్లు సరిపోతుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాబట్టి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెరిగితే తెలంగాణలోని నెట్టంపాడు, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసి, ఏఎంఆర్‌పీ ప్రాజెక్టులకు.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతోపాటు, దక్షిణ తెలంగాణలోని 27.4 లక్షల ఎకరాలకు నీటి లభ్యత ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అందరం సమష్టిగా పోరాడి కర్ణాటక ఎత్తుగడలను తిప్పికొడదామని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.

More Telugu News