Bandla Ganesh: హరీశ్ శంకర్ తో గొడవపై బండ్ల గణేశ్ స్పందన!

Bandla Ganesh response on disputes with Harish Shankar
  • అన్నదమ్ముల మధ్య గొడవలు సాధారణమే
  • కోపంలో ఏవో అనుకుంటాం
  • హరీశ్ మంచి దర్శకుడు
కరోనా కష్ట కాలంలో టాలీవుడ్ సినిమాలు విడుదల కాకపోయినా... సినీ ప్రముఖుల మధ్య విభేదాలు మాత్రం బయటపడ్డాయి. పలు వివాదాలు టాలీవుడ్ ను కుదిపేశాయి. వీటిలో నిర్మాత బండ్ల గణేశ్, దర్శకుడు హరీశ్ శంకర్ ల మధ్య జరిగిన వివాదం ఒకటి. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా 'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా... ఆ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ ప్రారంభమైంది.

హరీశ్ శంకర్ పై బండ్ల గణేశ్ ఫైర్ అయ్యారు. అతనొక రీమేక్ డైరెక్టర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదని అన్నారు. తాజాగా కరోనా పాజిటివ్ నుంచి బండ్ల గణేశ్ కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మరోసారి ఈ వివాదంపై యాంకర్ ఆయనను ప్రశ్నించింది. గొడవ గురించి అడిగింది.

దీనిపై గణేశ్ స్పందిస్తూ... అన్నదమ్ముల మధ్య చిన్నపాటి గొడవలు సాధారణమేనంటూ ఆయన సమాధానమిచ్చారు. మా అమ్మ మీద, భార్యాపిల్లల మీద కూడా అలిగి రెండు, మూడు రోజులు మాట్లాడటం మానేస్తానని... అంతమాత్రాన వారు సొంత మనుషులు కాకుండా పోతారా? అని అన్నారు. హరీశ్ శంకర్ వివాదం కూడా ఇంతేనని... కోపంలో ఏవేవో అనుకుంటామని... ఈగోల వల్లే ఇలాంటివి వస్తుంటాయని చెప్పారు. హరీశ్ మంచి దర్శకుడని, అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే సినిమా ఎందుకు చేయనని అన్నారు. ఇలాంటి వాటిపై మాట్లాడటం టైమ్ వేస్ట్ అని చెప్పారు.
Bandla Ganesh
Harish Shankar
Tollywood

More Telugu News