Gandhi Family: గాంధీల కుటుంబాలకు చెందిన మూడు ట్రస్టులపై ఈడీ దర్యాప్తుకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం

Government Panel To Handle Investigations Against 3 Gandhi Family Trusts
  • విరాళాలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు
  • మనీలాండరింగ్, ఐటీ, విదేశీ విరాళాల చట్టాల కింద దర్యాప్తు
  • దర్యాప్తు కమిటీకి నేతృత్వం వహించనున్న ఈడీ స్పెషల్ డైరెక్టర్
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గాంధీల కుటుంబానికి చెందిన మూడు ట్రస్టుల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తుకు ఆదేశించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలలో అవకతవకలు జరిగాయని, ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలను కూడా ఉల్లంఘించారని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ తెలిపింది. మనీలాండరింగ్ చట్టం, ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం, విదేశీ విరాళాల చట్టాల కింద దర్యాప్తు జరుగుతుందని ప్రకటించింది. దర్యాప్తు కమిటీకి ఈడీకి చెందిన స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తారని చెప్పింది.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ను 1991 జూన్ లో ప్రారంభించారు. రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ను 2002లో స్థాపించారు. వీటికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ట్రస్టులకు సంబంధించిన అన్ని అకౌంట్లు చాలా పారదర్శకంగా ఉన్నాయని చెప్పారు. బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ప్రియాంకగాంధీకి ప్రభుత్వ బంగళాను తొలగించారని, రాహుల్, సోనియాలకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసు నడుస్తోందని అన్నారు.

మరోవైపు బీజేపీ నేతలు మాట్లాడుతూ... మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు రూ. 100 కోట్లను కేటాయించారని ఆరోపిస్తున్నారు.
Gandhi Family
Trusts
ED
Enforcement Directorate

More Telugu News