Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy demands to release KCRs health bulletin
  • 6 నెలలు ఫాంహౌస్ నుంచే కేసీఆర్ పాలిస్తారనే వార్తలు వస్తున్నాయి
  • గవర్నర్ సమీక్షకు హాజరుకాని సీఎస్ పై చర్యలు తీసుకోవాలి
  • కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ తమిళిసై నిర్వహించిన సమీక్షకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి హాజరు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సమీక్షకు హాజరుకాని సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. గవర్నర్ పిలిచినా వెళ్లని వీరిద్దరినీ విధుల్లో నుంచి తొలగించాలని అన్నారు.

ఇంత జరుగుతున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని రేవంత్ మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని అన్నారు. సెక్షన్ 8ని గవర్నర్ ఉపయోగించాలని... హైదరాబాదులో హెల్త్ ఎమర్జెన్సీని విధించాలని కోరారు. కరోనా కట్టడి కోసం దాతలు ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని... సీఎం పర్యవేక్షణ లేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని రేవంత్ చెప్పారు. రానున్న 6 నెలల పాటు ఫాంహౌస్ నుంచే కేసీఆర్ పాలనను నిర్వహిస్తారనే వార్తలు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశంలోనే 'వేర్ ఈజ్ కేసీఆర్' అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉందని అన్నారు.  ప్రజాప్రతినిధుల ఆరోగ్యంపై కూడా బులెటిన్ విడుదల చేయాలని కోరారు.
Revanth Reddy
Congress
KCR
TRS
Corona Virus

More Telugu News