Reels: టిక్ టాక్ పై నిషేధం నేపథ్యంలో 'రీల్స్' కు మెరుగులు దిద్దుతున్న ఇన్ స్టాగ్రామ్

Instagram introduces Reels feature in the absence of Tik Tok
  • టిక్ టాక్ ను నిషేధించిన కేంద్రం
  • ఇతర యాప్ లకు రెక్కలు!
  • 'రీల్స్' తో యూజర్లను ఆకట్టుకునేందుకు ఇన్ స్టాగ్రామ్ యత్నం
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై కేంద్రం నిషేధం విధించడంతో ఇతర యాప్ లకు జీవకళ వచ్చింది. భారత్ నుంచి టిక్ టాక్ నిష్క్రమించినప్పటి నుంచి ఇతర వీడియో యాప్ లు లక్షల్లో డౌన్ లోడ్లు సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఇన్ స్టాగ్రామ్ లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 'రీల్స్' అనే ఫీచర్ కు తుది మెరుగులు దిద్ది త్వరలోనే అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ 'రీల్స్' అనేది ఓ షార్ట్ వీడియో మేకింగ్ ఫీచర్. దీంట్లో మ్యూజిక్, ఆడియో క్లిప్స్ సాయంతో లఘు వీడియోలు రూపొందించవచ్చు.

ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో యూజర్లకు అందుబాటులో ఉంది. బ్రెజిల్లో పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు. భారత్ లో కూడా ఎంపిక చేసిన యూజర్లకు ఈ ఫీచర్ అందిస్తారు. కాగా, ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్ బుక్ తన 'లస్సో' యాప్ కు మంగళం పాడింది. 'లస్సో' కూడా వీడియో షేరింగ్ యాప్. టిక్ టాక్ కు పోటీగా ఫేస్ బుక్ 'లస్సో'ను ముస్తాబు చేసింది. అయితే యూజర్ల ఆదరణ టిక్ టాక్ పైనే అధికంగా ఉండడంతో, ఫేస్ బుక్ ఇటీవలే 'లస్సో' యాప్ కు స్వస్తి పలికింది. ఇప్పుడు టిక్ టాక్ లేని నేపథ్యంలో 'రీల్స్' ఫీచర్ విజయవంతం అవుతుందని ఫేస్ బుక్ ఆశిస్తోంది.
Reels
Instagram
TikTok
Facebook
Lasso

More Telugu News